10, ఫిబ్రవరి 2025, సోమవారం

గుణ పాఠం!!!

 #తృప్తి


ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు.


కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు.

 సాధువుకు సంతోషం వేసింది . ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు.


తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. ‘‘ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.


నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. 

రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. 

 

సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. 


ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు.

అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు.


రాజు అంతరార్థం గ్రహించాడు.‌ దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు.


నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం.

 ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే! 


ధనదాహం, కోరికలు ఉన్నవారికి గుణపాఠం !!!

1 కామెంట్‌:

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...