రేడియో దినోత్సవం
సమాచార సాంకేతిక విజ్ఞానం ఎన్ని కొత్త పుంతలు తొక్కినా...
యునెస్కో 2012 నుంచి ఏటా ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో_దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
అందరి హృదయాల్లో పదిలంగా నిలిచే ప్రసార సాధనం రేడియో!
సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే అత్యంత ప్రాచీన మాధ్యమమిది. అక్షరాస్యులు కానివారికీ సులభగ్రాహ్యమైన సాధనం... రేడియో.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 75శాతానికిపైగా గృహిణులు ఇప్పటికీ వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపైనే ఆధారపడుతున్నారని అంచనా.
ఎన్ని టీవీ ఛానళ్లు, వార్తా పత్రికలున్నా ఇప్పటికీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితుల స్థితిగతులు తెలుసుకొని, త్వరితగతిన సమాచారం చేరవేసి, విలయంనుంచి వారిని కాపాడేందుకు ఉపయోగించే సాధనమిదే. యుద్ధాల్లో పాల్గొనే సైనికులు, సరిహద్దుల్లో పహరా కాసే జవాన్లకు సమాచారం అందజేసే సాధనమూ ఇదే. కాలక్రమేణా రేడియో రూపురేఖలు మార్చుకుని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుని... మానవ జీవితంలో విడదీయలేని భాగంగా మారింది!
తొలినాళ్లలో రేడియో సెట్లలో ఇప్పటిలా లౌడ్ స్పీకర్లు ఉండేవి కావు. నాటి రేడియో నమూనాలను క్రిస్టల్‌నెట్ అనేవారు. భారత్‌లో తొలి రేడియో స్టేషన్ బ్రిటిష్ హయాములో బాంబేలో ప్రారంభమైంది. 1923 జులై 23న ఆ స్టేషన్ నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ 1936లో ఆల్ ఇండియా రేడియోగా అవతరించింది. తెలుగువారి తొలి రేడియో ఆకాశవాణి మద్రాసు కేంద్రం.
ఈ ప్రసారాలు 1938 జూన్ 16న ప్రారంభమయ్యాయి. ‘నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుతున్నాను... మీరెక్కడినుంచి వింటున్నారో చెప్పజాలను’ అంటూ నాడు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారతదేశం-రేడియో’ అనే అంశంపై ప్రసంగిస్తూ మాట్లాడిన తొలిపలుకులతో, వేన్కుడు సుబ్రమణ్యపిళ్ళై నాదస్వరం వాయిస్తుండగా తొలి తెలుగు రేడియో ప్రసారాలు ప్రాణం పోసుకున్నాయి.
ఒకప్పుడు సమాచార మార్పిడికి మాత్రమే పరిమితమైన ఈ సాధనం- కాలక్రమేణా కొత్తపుంతలు తొక్కుతూ ఇంటింటి బంధువయింది. విద్య, వినోదం, విజ్ఞానం, నాటకం, వార్తా ప్రసారం, శాస్త్రీయ-జానపద సంగీతం, రైతులు, మహిళలు, పిల్లలు, క్రీడలు వంటి అనేక అంశాలను సమపాళ్లలో మేళవించి భిన్న వర్గాలను ఆకట్టుకుంటోంది.
ప్రధానమంత్రి మోదీ సైతం ‘మన్ కీ బాత్’ పేరిట దేశ ప్రజలతో అభిప్రాయాలను పంచుకునేందుకు రేడియో మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నారు. పాతతరం రేడియోతో పోలిస్తే నేడు రేడియోను వినే వారి అభిరుచులూ మారాయి. అందుకే కొన్ని రేడియో కేంద్రాలు ‘పాడ్ కాస్ట్’ల రూపంలో ప్రముఖుల మాటలనూ శ్రోతలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.
కాలానుగుణంగా తీరు మార్చుకుంటూ సమాజంతో గొంతు కలుపుతున్న రేడియోది... ప్రజా హృదయాల్లో చెరిగిపోని స్థానం!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి