30, డిసెంబర్ 2024, సోమవారం

వృద్ధాప్యం !!!


నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే , గగనం నిండా ఎన్నో నక్షత్రాలు , క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి...


నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు...


నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు...


నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు...


బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు..


నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు....


నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది...


దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది...


అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది...


పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు...


నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు...


ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి...


నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు...

 

ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు...ఇలా ఎందుకు జరుగుతుంది... అంటే ఇక నీ అవసరం తీరింది కాబట్టి....నీ అవసరం ఇక వుండదు కాబట్టి..


ఇక్కడ తరిగింది కృతజ్ఞత , ప్రేమ , అభిమానం... పెరిగింది కృతఘ్నత , నిర్లజ్జ , అమానుషం ...


ఇవి చదవటానికి, వినటానికి చిత్రంగా ఉన్నా, చాలామంది జీవితాల్లో జరగబోయే పచ్చి నిజాలు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...