12, డిసెంబర్ 2024, గురువారం

అంతా మన మంచికే !!!

 మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తారో   మనకే తెలియని ఒక చిత్రమైన విషయం. అయితే మనం తెలుసుకో వలసిన అంశం ఏమిటంటే దీని వెనుక ఉండి మనల్ని నడిపించేవాడు ఆ నటన సూత్రధారి అయిన పరమ సర్వేశ్వరుడే అనేది చాలామందికి తెలియని విషయం..

మనం మన కళ్ళముందే జరుగుతున్న ఎన్నో సంఘటనలను చూస్తున్నాం.. ఒకరికొకరికి సంబంధం లేని వ్యక్తులను మన జీవితంలో బంధం, సంబంధం, స్నేహం, ప్రేమ వంటి పేర్లతో ఆ భగవంతుడు ఇంకో మనిషిని మనతో కలుపుతూ ఉంటాడు. అలా ఆ భగవంతుడు మనుషులను బంధాలు స్నేహాలనే పేరుతో కలుపుతూ అదే బంధాలను తిరిగి కాలగర్భంలో కలిపేసేది ఆ భగవంతుడే..!


మన జీవితంలో ఒక వస్తువు కాని, ఒక మనిషి కాని, ఒక జంతువు కాని వాటితో మనకు పూర్వ జన్మ ఋణబంధము వుంటేనే తప్ప ఏవీ కూడా మనదరికి చేరవు. పూర్వ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి, ఋణాన్ని బట్టి ఈ జన్మలో భార్య కాని, భర్త కాని వివాహ బంధంతో ఏకం అవుతారు. అలాగే బంధు బంధంతో బంధుత్వాలు, మిత్రబంధంతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా పూర్వ జన్మలోని ఋణాను బంధాలే అని తెలుసుకోవాలి. అలాగే దంపతులకు పిల్లలు పుట్టాలన్నా గతజన్మలో వారి ఋణము మనకు వుండాలి. ఇక మన ఇంట తిరిగే పశుపక్ష్యాదులు వేరే ఏ ఇతరాలైనా కూడా మనకు ఋణము వుంటేనే తప్ప మనదరికి చేరవు. ఆ బుణం తీర్చుకోవడానికే వారు మనకు చేరువవుతారు. అలాగే ఋణము వుంటేనే తప్ప ఎవరితోనైనా స్నేహాలు, బంధువులనే బాంధవ్యాలు కలుస్తాయి. అలాగే మనకు ఎవరైనా కొత్త వారు ఎదురుపడినా, పరిచయం ఏర్పడినా, లేక మాట కలిపినా కూడా ఇవన్నీ కూడా గతజన్మ ఋణాను బంధాలే సుమా!


అలాగే గతజన్మ ఋణానుబంధం అనేది లేకుంటే ఎవరినీ మన కలలో కూడా మనం వారిని చూడలేము. అయితే ఇక ఈ ఋణం అనేది తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మనతో నిలవదు. స్నేహితులే కాదు బంధువులు కూడా ఏదో ఒక కారణంతో మనతో శాశ్వతంగా విడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఋణాను బంధం విలువ తెలుసుకుని మసులు కోవాలి. ఈ ఋణబంధం అనేది కేవలం ధన ఋణం వరకు మాత్రమే కాదు, బాంధవ్యబంధం కూడా ఉంటుంది. అందుకే ధన బంధం కంటే ఈ ఋణ బంధానికి మనం ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాలి. 'మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో ఋణబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి 


కాబట్టి మిత్రులారా ! 'ఋణం లేనిదే త్రుణం కూడా మనకు ముట్టదు' అని మన పెద్దలు చెప్పారు కదా ! అది నిజం. ఎందుకంటే ఆ ఋణం లేనిదే మనం ఎంత యత్నించినా కూడా ఏది కూడా మనతో కలిసిరాదు. అలాగే మీ జీవితంలో ఏ బంధం కూడా నిలువదు. కాబట్టి మీ నుండి ఏ బంధమైనా తెగిపోయినా, లేదా ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ విరహ భావన వల్ల మీకు బాధ కలుగవచ్చు. ఒకవేళ మీకు అలా బాధ కలిగినా మీరు బాధపడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు సత్యం బోధపడింది కదా..


  అంతే కాదు అలా జరిగినందుకు ఎదుటి వారిని నిందించకండి. మన జీవితంలో ఆ బంధం కొనసాగేది అంత వరకే అన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఎవ్వరిపైన ఎప్పటికీ ఎటువంటి కోపం రాదు. వాళ్ళు మీ నుండి విడిపోయి మీకు దూరమై దూరంగా ఉన్నా, ఒకప్పుడు వారు మన వాళ్లేగా, అది ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా అనుకుంటూ, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోండి. వాళ్ల సంతోషాన్ని కోరుకోండి. మీరూ సుఖంగా ఉండండి, ఎదుటి వారిని సుఖంగా జీవించ నివ్వండి.. బంధాలను కల్పించేదీ, కాలగర్భంలో కలిపేసేదీ ఆ సర్వేశ్వరుడే అనేది మాత్రం గుర్తించుకొని జీవించండి.. అప్పుడు మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడే అవకాశమే రాదు.


ఈ సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానంతో, మోహ బంధంతో ఒక వ్యక్తి పైన గానీ, ఒక వస్తువు పైన గానీ, ఒక జంతువు పైన కానీ విపరీతమైన ప్రేమానురాగాలను పెంచుకొని విధి వశాత్తూ అవి మన నుండి దూరం అయితే ఆ వ్యక్తి ఆ బాధను భరించలేక మానసిక వేదనతో వత్తిడికి గురౌతున్నాడు. చివరికి ఆ మానసిక ఒత్తిడి అతడిని శారీరకంగా, మానసికంగా వేదనకు గురిచేస్తుంది. చివరికి అతడిని దీర్ఘకాలిక రోగగ్రస్తున్ని చేస్తుంది. అది భార్యా భర్తల బంధం కావోచ్చు, ప్రేమగా పెంచుకున్న కొడుకు బంధం కావోచ్చు, మంచి స్నేహితుడితో స్నేహబంధం కావచ్చు. ఇలా ఈ బంధాలన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మన నుండి దూరమైనప్పుడు ఇదంతా మన మంచికే జరిగింది అనుకొని అంతటితో వాటిని వదిలి వేయాలి. బంధాలను పట్టుకుంటే రోగం, వదిలేస్తే యోగం. ఇదే అందరూ తెలుసుకో వలసిన సత్యం.


మన జీవితంలో ఏది జరిగినా 'అంతా నా మంచికే జరిగింది' అనే భావనతో జీవించాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అంటారు. అలాంటి పాజిటీవ్ థింకింగ్ తో జీవించే వారికి ఎలాంటి శారీరక మానసిక జబ్బులు రానే రావు 🙏


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...