31, జనవరి 2025, శుక్రవారం

కథ !!!

 #ఉచిత_సలహా


#చిన్న_ఆధ్యాత్మిక_కథ


కష్టము, కన్నీళ్ళు, సంతోషము, భాధ ఏవి శాశ్వతంగా ఉండవు అని తెలియజేసే అద్భుతమైన సన్నివేశంను వివరించే కథ

మీ అందరి కోసం..


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే.

నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు.


"ఓరోజు శ్రీ మహవిష్ణు శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది, కించపరిచింది.

‘‘నేను శ్రీ మహవిష్ణు శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు. అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు.

నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తే నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు.

నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం.

అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు.

కానీ శ్రీ మహవిష్ణు ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి. పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు.

 మిమ్మల్ని నేనెప్పుడు తక్కువ చేయలేదుగా. కిరీటం అన్నా మాటలకు బాధపడుతున్నారా..’’ అని అడిగాడు.

వెంటనే పాదరక్షలు తమ గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు, దాన్ని మరచిపొండి. కిరీటం మాటలు పట్టించుకోకండి.


నేను రామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. 

సరేనా..’’ అని హామీ ఇచ్చాడు. ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. 

అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. 

భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది.


ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. 

కష్టము శాశ్వతం కాదు, అలాగే సంతోషమూ శాశ్వతం కాదు.


#అందరూ_సమానమే !!!

1 కామెంట్‌:

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...