26, జనవరి 2025, ఆదివారం

జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి !!!

 #నేతాజీ_సుభాష్_చంద్రబోస్_జయంతి 🙏


నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.


బోసు గారికి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.


బోసు గారికి రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపాన్‌తో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.


సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారతదేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి దేవి. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై లోను సాగింది.


1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగాడు.


సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్‌ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలసి బోస్ బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు.


ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో క్రొత్త భావాలు చోటు చేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తరువాత Letters to Emilie Schenkl అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు.


1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్‌ నుండి వైదొలగాడు. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" (All India Forward Bloc) పార్టీని స్థాపించాడు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీ" (National Planning Committee) అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.


అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.


1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.[5] అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది. .[6]


ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది.


1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు


భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. ఏదైనప్పటికి భగవాన్  జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.


మహానుభావుల చరిత్రలు , వారు దేశానికి చేసిన సేవల గురించి , రగిలించిన స్పూర్తి గురించి యువతకి , పిల్లలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...