31, జనవరి 2025, శుక్రవారం

కథ !!!

 #ఉచిత_సలహా


#చిన్న_ఆధ్యాత్మిక_కథ


కష్టము, కన్నీళ్ళు, సంతోషము, భాధ ఏవి శాశ్వతంగా ఉండవు అని తెలియజేసే అద్భుతమైన సన్నివేశంను వివరించే కథ

మీ అందరి కోసం..


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే.

నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు.


"ఓరోజు శ్రీ మహవిష్ణు శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది, కించపరిచింది.

‘‘నేను శ్రీ మహవిష్ణు శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు. అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు.

నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తే నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు.

నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం.

అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు.

కానీ శ్రీ మహవిష్ణు ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి. పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు.

 మిమ్మల్ని నేనెప్పుడు తక్కువ చేయలేదుగా. కిరీటం అన్నా మాటలకు బాధపడుతున్నారా..’’ అని అడిగాడు.

వెంటనే పాదరక్షలు తమ గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు, దాన్ని మరచిపొండి. కిరీటం మాటలు పట్టించుకోకండి.


నేను రామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. 

సరేనా..’’ అని హామీ ఇచ్చాడు. ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. 

అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. 

భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది.


ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. 

కష్టము శాశ్వతం కాదు, అలాగే సంతోషమూ శాశ్వతం కాదు.


#అందరూ_సమానమే !!!

26, జనవరి 2025, ఆదివారం

తణుకు ఫిష్ అక్వేరియం ఎగ్జిబిషన్ 2025 !!!






 

శ్రీ శ్రీ శ్రీ మావళ్ళమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు 2025 !!!



 

పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి !!!

 


మేటి మాట !!!


 

మేటి మాట !!!


 

మేటి మాట !!!


 

సగటు మనిషి జీవితం !!!



బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్ లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది.


స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు.


సరే  జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు.


డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు.


సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేస్తాడు.


కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి ఈ సారి దేవుడి మాట వినడు.


 కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు. హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవరూ ఉండరు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు.


సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరిపోతారు.

 

కొందరు పిల్లలు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళను తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు.


శక్తి మొత్తం క్షీణించి, ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది.


 తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్.


 అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు.


 ఇదే సగటు మనిషి బతుకుతున్న జీవితం !!!


జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి !!!

 #నేతాజీ_సుభాష్_చంద్రబోస్_జయంతి 🙏


నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.


బోసు గారికి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.


బోసు గారికి రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపాన్‌తో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.


సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారతదేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి దేవి. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై లోను సాగింది.


1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగాడు.


సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్‌ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలసి బోస్ బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు.


ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో క్రొత్త భావాలు చోటు చేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తరువాత Letters to Emilie Schenkl అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు.


1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్‌ నుండి వైదొలగాడు. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" (All India Forward Bloc) పార్టీని స్థాపించాడు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీ" (National Planning Committee) అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.


అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.


1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.[5] అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది. .[6]


ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది.


1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు


భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. ఏదైనప్పటికి భగవాన్  జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.


మహానుభావుల చరిత్రలు , వారు దేశానికి చేసిన సేవల గురించి , రగిలించిన స్పూర్తి గురించి యువతకి , పిల్లలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది 

కథ !!!

 #కథ


పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.


"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి అప్పగించారాదూ!” అన్నాడు.


భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.

ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.


ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు రైతు.

కురిసింది. ఆగమనగానే ఆగింది.


తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది.

విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.

పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.

కోతల కాలం వచ్చింది.


రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు. లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.


"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"


భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.


అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.

"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.


జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సవాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.


నేటి తరం పిల్లలను తల్లిదండ్రులు కూడా ఇలా చేసే సోమరుల్ని చేస్తున్నారు .


ఈ కథ ఒక మేలుకొలుపు కావాలనే ఆశతో ..!


జనవరి 26 కు ఆగస్టు 15 కు తేడా ?

 August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?✍️


ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. 


అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 


ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము👇


👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.


ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. 


మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.


👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. 


ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.


( గమనిక:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి )


దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.


స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.


అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.


అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..


👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting).


👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు* (Flag Unfurling) .


ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.


👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.


👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

16, జనవరి 2025, గురువారం

భోగి పళ్ళు !!!

భోగి పళ్ళు !!!

తెలుగువారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్లే గుర్తుకువస్తాయి. ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూలరెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని…. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగినాడు రేగుపళ్లని ఇంతగా తల్చుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి.


రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఓ నమ్మకం. అందుకు అనుగుణంగానే దీన్ని ‘ఇండియన్‌ డేట్‌’ అనీ ‘ఇండియన్‌ జుజుబీ’ అనీ పిలుస్తారు. అందుకు తగినట్లుగానే మన పురాణాలలోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది. సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.


దక్షిణభారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పుల్లపుల్లగా ఉండే ఈ రేగు పళ్లు తినడానికి రుచిగా ఉండటమే కాదు, సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధి గుణాలతో నిండి ఉంటాయి. మన దేశంలోనే కాకుండా తూర్పుదేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.


భోగిరోజున దిష్టి తీసిన పళ్లను తినకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, పిల్లలు తినేందుకు కావల్సినన్ని రేగుపళ్లు ఈ రోజు అందుబాటులో ఉంటాయి. ఈ భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. రేగుపళ్లు నిజంగా వీరిపాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.అందుకే రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.


ఇక రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది కూడా! చర్మసంబంధమైన ఎలాంటి వ్యాధినుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది.  బంతిపూల నుంచి తయారుచేసిన ‘కేలెండ్యులా’ ఆయింట్‌మెంట్‌ని హోమియోపతిలో చాలా విస్తృతంగా వాడతారు. భోగిపళ్ల సంస్కృతి ఇంత గొప్పదని తేలాక తెలుగువారు దాన్ని ఆచరించకుండా ఎలా ఉంటారు !!!

కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు !!!!

 కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు...!!


సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. 


పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులు వేలాడదీస్తారు.


ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. 


దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. 


ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారనీ, వారిని తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలనీ ఓ ఆచారం.


కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. 


అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.


కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారుచేయడమే కాదు... దాన్ని అందరూ కలిసితినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు.


పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. 


కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగుతాయి.


అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు... భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. 


కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి... పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని... మర్నాడు ప్రయాణించమని చెబుతారు. 


అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. 


కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. 


అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ... ఒకవేళ కాదూకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు !!!

10, జనవరి 2025, శుక్రవారం

దేవుడి చిరునామా !!!

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు.


"స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?" కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.


సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు.


"దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?" పరిహాసంగా అడిగాడు అతను.


అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు.


"నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు. 


పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల.


"ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి.


"మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి.


"మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.


"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల.


అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి.


తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.


ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ' ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది.. 

అతని దగ్గరకు వెళ్లి.ఆ.విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. ' ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".


కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు.


"మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. 


దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. 

అదే దేవుని చిరునామా !!!

గొప్ప మనసు !!!


              నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది.


ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను."ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు".. అన్నాడు.


అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య.

పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను.

వారం నుండి పని కోసం తిరుగుతున్నాను.

ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.


అక్కడే ఉన్న మేస్త్రి " నీవెవరివో తెలీకుండా... నీపనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.

     

అతను నా వైపు జాలిగా చూస్తూ"  ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయచూపండి" అని ప్రాధేయ పడ్డాడు.


నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ... కన్నుల్లో ఆకలి కనిపించింది.


మేస్త్రితో " తెలిసిన పనే అంటున్నాడుగా!

ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను.

 మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం" అన్నాడు.

అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూసాను. కష్టపడి పనిచేయడం గమనించాను. "పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను.


మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు.


రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను.


మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని  ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను. రాజయ్య మాత్రంమంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు.


అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది. మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు.


రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. "నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను.


 "నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ  దయవల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను.


అతను బయలు దేరిపోయాడు. ఎందుకో తెలీదు... రాజయ్య వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురు పడ్డాడు.

 

రాజయ్య ఆగి తనను దాటి పోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు.

అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి.

రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈపూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు.

అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది.

"ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది.


బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ" చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు.


రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ" ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి".. అన్నాడు.


రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు.


స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడ సాగాడు.

ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి.


రాజయ్య చేసినపనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు.

ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా.


"ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.


"డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవినపడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు.


అతని ఆకలి... ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.


అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి... రాజయ్యతో అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకోటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!"అని రాజయ్యకు డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు.


రాజయ్య అతన్ని వారిస్తూ" డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు.


కొంచెం సేపు అలానే ఉండిపోయాను.

తరువాత బైక్ స్టార్ట్ చేసి... రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు" అన్నాను.

"వద్దు అయ్యగారూ!" అన్నాడు." మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను.


ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.

 

"అదేంటి  అయ్యగారూ!మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య.


"డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!" అనిబైక్ స్టార్ట్ చేసాను.


బైక్  డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.

నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు !!!

నీకు నువ్వే దీపం !!!


ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. 

ఒకతని దగ్గర లాంతరు ఉంది.

 ఇంకొకతని దగ్గరలేదు. 

కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.


దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే సునాయాసంగా సాగుతున్నాడు. 

కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే.


లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు. 

కారణం దాని అవసరం అక్కడ లేదు.


అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాకా ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు. 

అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది. 

అక్కడినించీ దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి.


లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపు తిరిగి వెళ్ళిపోయాడు. 

కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.


లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు. 

కారణం చీకటి. 

అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాకా తన మార్గం అంధకారబంధురమయింది.

 తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు.


మనకు ఇతరులు #కొంతవరకే_మార్గంచూపిస్తారు. 

తరువాత మనదారి మనం వెతుక్కోవాలి. 

చివరిదాకా #ఎవరూ_ఎవరికీదారిచూపరు. 

గురువు చేసే పనయినా అదే.

 గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది.

 శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు !!!

4, జనవరి 2025, శనివారం

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!


 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ?

ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ఒక ప్రేమ జంట వాళ్ళ పెళ్లి ఇంటిలో వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ,మరొక జంట వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ నాన్న, ఇద్దరు అన్నలు వాళ్లకు పెళ్ళిళ్ళు అవ్వవు మూడో వాడు తమ్ముడు వాడికీ బ్యాంక్ లో జాబ్ ఉంది కాబట్టి వాడికి పెళ్లి అవుతుంది కానీ వాళ్ళు ప్రైవసీ గా ఉండటానికి కుదరదు 

ఇంకా 3 వ జంట వాళ్లకు ఫారిన్ లో జాబ్ అయితే పెళ్ళికొడుకు తల్లి, తండ్రులు ఉండరు పెళ్లి కూతురు ఆన్లైన్ గేమ్స్ అడి డబ్బులు పోగొట్టుకుంటుంది ఆ డబ్బును పెళ్లి కొడుకు తీర్చాడ లేదా అన్నది మిగిలిన కథ

ఇంకా 4 జంట అంతకు మునుపే పెళ్లి అయ్యి పోలీస్ గా పనిచేస్తున్న ఒక ఆవిడ , బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న ఒక ఆయనకు పెళ్లి జరుగుతుంది అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి కాకముందే ఆయనకి ఒక కొడుకు ఉంటాడు ఇవిడకు ఒక కొడుకు ఉంటాడు వీళ్ళ కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ చాలా స్లో గా ఉంది కథ 

అసలు చూడకండి నాకైతే నచ్చలేదు సినిమా !!!

1, జనవరి 2025, బుధవారం

పెద్దల ఆశీర్వాదం విలువ !!!

 పెద్దల_ఆశీర్వాదo_విలువ 


మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు పోయి నప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు. ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవు తుంది. చాలా మంది ఇది అబద్ధం అనుకుంటారు. మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు. 


మనం కూడా వారిలో ఒకరు అoదుకే, ఈ రోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా మరియు ఫలవంత మైనదో తెలియజేసే కథను తెలుసుకుందాం.


పూర్వం సదాచార వేద పండితుడు ఒకడుండే వాడు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్సుద్ధి కలవాడిగా పేరొందినవాడు. 


అవసాన దశలో కొడుకుని పిలిచి, నాయనా! నేను నీకంటూ ఏ అస్తిపాస్తులు కూడపెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే.

         

జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలన కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయ  వంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది *నాయనా! ", అని చెప్పి ప్రాణాలు వదిలాడు. తండ్రికి చేయవలసిన ఖర్మలన్నీచేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు. 


విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని క్రిందకు పోస్తున్నాడు. ఒకసారి పోసాడు. రెండో సారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదము గుర్తుకొచ్చింది. *"పట్టిందల్లా బంగారం అవుతుంది"* ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రిందికి పోసి చూసాడు. మూడో సారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తలపకెత్తే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురి పెట్టి నిల్చొని వున్నారు. ప్రక్కన రాజు గారు వున్నారు. 

      

ఆయన తీవ్రంగా ఏం చేస్తున్నావు? ఏం వెతుకు తున్నావని అడిగారు. దానికి తండ్రి మరణం, తన దుస్తితి వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా తొలగారు. 


రాజు గారు అన్నారు, మా నాన్న గారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు ఒక బహుమతిగా ఒక ఉంగరo ఇచ్చారు. అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడి పోయింది. రెండు రోజులుగా వెతుకు తున్నాం. నీవు అవిషయం తెలుసు కొని వెతుకు తున్నావని మా సైనికులు అనుకొన్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలి లేచాడు. తండ్రి వాక్భలం.ఆ ఇసుక లొనే రాజుగారి ఉంగరం దొరినది.

      

రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.వెంటనే మూడు సoచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యoలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు.


తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవo.


#సారాంశం

మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ !!!

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...